కృష్ణకో న్యాయం.. మాకో న్యాయమా?
న్యాయం చేయండి : డీఎస్‌కు నానక్‌రాంగూడ రైతుల వినతి
హైదరాబాద్, న్యూస్‌టుడే: హైదరాబాద్ సమీపంలోని నానక్‌రాంగూడలో సేకరించిన భూముల్లో ప్రభుత్వం ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందని ఆ ప్రాంత రైతులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ను కల్సుకుని వినతిపత్రం అందజేశారు. 2002లో అప్పటి తెదేపా ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే 92 ఎకరాల భూములను ఏపీఐఐసీకి అప్పగించిందని తెలిపారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ భూముల్లో నటి విజయనిర్మలకు చెందిన 12 ఎకరాలను మినహాయిస్తూ జీవో మార్చారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. న్యాయం చేయాలని తాము కోరుతుంటే పట్టించుకోని ప్రభుత్వం.. కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేసిందన్నారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా సినీనటుడు కృష్ణ కుటుంబీకులకు సంబంధించి సర్వే నెంబరు 28లోని 3 ఎకరాల 26 సెంట్ల భూమిని మంత్రి సహకారంతో ఏపీఐఐసీ నుంచి మినహాయించారని పేర్కొన్నారు. భూముల కోసం పోరాడుతూనే మాజీ సర్పంచ్ మోతీలాల్ ప్రాణాలు కోల్పోయారన్నారు. పేదల రైతుల ఆధీనంలోని 40 ఎకరాల వ్యవసాయ భూమికి ప్రత్యామ్నాయంగా గోపన్‌పల్లి లేదా పుప్పాలగూడలో భూమినివ్వాలని, లేదంటే మార్కెట్ రేటు ఇప్పించాలన్నారు. భూములు కోల్పోయిన రైతులు తిండిలేక, పిల్లలను చదివించలేక, బిడ్డలకు పెళ్లిళ్లు చేయలేక ఇబ్బందులకుగురవుతున్నట్లు తెలిపారు
(Courtesy: Eenadu, 24th Oct 2008)

